<no title>పౌరసత్వ సవరణ చట్టానికి అమెరికా మద్దతు

పౌరసత్వ సవరణ చట్టానికి అమెరికా మద్దతు


వాషింగ్టన్‌ : భారత్‌ ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) అమెరికా మద్దతు పలికింది. దేశంలోని అంతర్గత  చర్చల తర్వాతే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించారని అమెరికా దౌత్యవేత్త  తెలిపారు. మైనారిటీ వర్గాల పరిరక్షణకు తాము నిరంతరం పాటుపడతామని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో తెలిపారు. బుధవారం వాషింగ్‌టన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాంపియోతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జయశంకర్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో ప్రజాస్వామ్య చర్చలు హేతుబద్దంగా జరుగుతాయని పేర్కొన్నారు. భారత్‌ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని కొనియాడారు.


భారత్‌కు సంబంధించిన విషయాలపైనే కాక ప్రపంచంలోని అనేక సమస్యలపై అమెరికా స్పందించిందని పాంపియో స్పష్టం చేశారు. అనంతరం పౌరసత్వ చట్టం ప్రజాస్వామ్యాన్ని, మతపరమైన హక్కులను కాపాడడానికి ఏ మేరకు ఉపయోగపడుతుందోనని పాంపియో ప్రశ్నించగా.. ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన మైనారిటీలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని, భారత్‌లో మైనారిటీలకు రక్షణ కలిగించే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని జయశంకర్‌ సమాధానం ఇచ్చారు.